
నిజామాబాద్, 23 ఆగస్టు (హి.స.)
నామినేటెడ్ పదవుల విషయంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నిబద్ధత కలిగిన కార్యకర్తలకే రాబోయే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే సెప్టెంబర్ నెలలోనే రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు.
భర్తీ చేయబోయే మొత్తం పదవుల్లో 80 శాతం గతంలో పార్టీకి అండగా నిలిచి కష్టపడిన పాత కార్యకర్తలకే కేటాయిస్తామని మహేశ్ కుమార్ గౌడ్ తేల్చిచెప్పారు. అదే సమయంలో పార్టీ బలోపేతానికి, భవిష్యత్తు అవసరాలకు కొత్త రక్తం కూడా అవసరమని, అందుకే మిగిలిన 20 శాతం పదవులను కొత్త నేతలకు ఇస్తామని వివరించారు. గతంలో పదవుల కేటాయింపులో కొన్ని చిన్నపాటి తప్పిదాలు జరిగాయని అంగీకరించిన మహేశ్ కుమార్ గౌడ్.. ఈసారి అలాంటి పొరపాట్లకు తావులేకుండా కేవలం క్రమశిక్షణ, నిబద్ధత, కష్టపడే తత్వమే ప్రామాణికంగా పదవుల భర్తీ ఉంటుందని హామీ ఇచ్చారు.కార్యకర్తల త్యాగాలు, వారి కష్టం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇదే ఉత్సాహంతో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ రాబోయే శాసనసభ ఎన్నికల్లో 100కు పైగా స్థానాలు గెలుచుకుని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన పలువురు ప్రముఖ నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..