
ఏలూరు జిల్లా, 23 ఆగస్టు (హి.స.)
భారత ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏపీలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఏలూరు జిల్లాలోని ముసునూరు మండలానికి ఈ నెల 24వ తేదీన ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రానున్నారు. గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప రాష్ట్రపతికి స్వాగతం పలకనున్నారు.
ముసునూరు గ్రామంలోని గౌర్మేట్ పాప్ కార్నిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పాప్ కార్న్ సీడ్ను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఆవిష్కరించనున్నారు. పాప్ కార్న్ ఉత్పత్తికి కృషి చేస్తున్న మొక్కజొన్న రైతులను ఉపరాష్ట్రపతి సన్మానించనున్నారు. రాధాకృష్ణన్ పర్యటించే ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లును పూర్తి చేస్తూ సుందరవనంగా అధికారులు తీర్చిదిద్దుతున్నారు. ఈ క్రమంలోనే సభాస్థలిని పరిశీలించి అధికారులకు మంత్రి కొలుసు పార్ధసారధి పలు సూచనలు చేశారు.
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లపై అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ సమావేశాన్ని ఉపరాష్ట్రపతి భద్రత అధికారులు, ఏలూరు జిల్లా కలెక్టర్ కె.వెట్రీ సెల్వి, ఏలూరు రేంజ్ ఐజీపీ జీవిజీ. అశోక్ కుమార్, ఏలూరు, కృష్ణా జిల్లాల ఎస్పీలు నిర్వహించారు. ఈనెల 24వ తేదీన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని, అక్కడ నుంచి రోడ్డు మార్గాన ముసునూరులోని గౌర్మెట్ పాప్ కార్న్ ఫ్యాక్టరీకి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ చేరుకోనున్నారు.
వార్తలు కూడా చదవండి...
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ