
సత్తెనపల్లి,, 24 ఆగస్టు (హి.స.)
స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు వెళ్లిన ఓ బాలిక లిఫ్టు నుంచి పడిపోయి మృతిచెందిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని ఓ కిరాణా దుకాణంలో పనిచేసే భవరిశెట్టి మహేష్, మణిదీపిక కుటుంబం వడ్డవల్లి పోలేరమ్మ ఆలయ సమీపంలో నివాసముంటోంది. వీరి ఏకైక కుమార్తె, ఏడో తరగతి చదువుతున్న రేవతి(12) తమ ఇంటి సమీపంలోని ఇద్దరు చిన్నారులతో ఆడుకునేందుకు వారి ఇంటికి వెళ్లింది. ఆ ఇద్దరు చిన్నారుల తాతయ్య, వ్యాపారి కోటేశ్వరరావు కుటుంబం తమ మూడంతస్తుల ఇంటికి ఇటీవలే లిఫ్ట్ ఏర్పాటు చేసుకుంది. సాయంత్రం లిఫ్టులో నుంచి శబ్దం రావడంతో అందరూ వచ్చి చూడగా, రేవతి తలకు తీవ్ర గాయమై గ్రౌండ్ ఫ్లోర్లో పడిపోయి ఉంది. బాలికను వెంటనే స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు తెలిపారు. తమ బిడ్డ మరణంపై అనుమానాలున్నాయంటూ బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. డోర్లు తెరుచుకోకుండానే లిఫ్ట్ నాలుగైదు అడుగులు పైకి వెళ్లి ఉండటం, లిఫ్ట్కు ఒక వైపున్న ప్లాస్టిక్ షీట్లు పగిలి ఉండటం, అక్కడి నుంచే బాలిక బయటపడటం.. అంతా అనుమానంగా ఉందని వాపోయారు. డీఎస్పీ కృష్ణచైతన్య ఘటనాస్థలిని పరిశీలించారు. బాలిక మృతిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగమల్లేశ్వరరావు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ