
హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)
విశాఖపట్నం నుంచి న్యూఢిల్లీకి భారీగా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టును హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మరియు అబిడ్స్ పోలీసులు రట్టు చేశారు. నాంపల్లిలోని సిటీ కన్వెన్షన్ సెంటర్ వద్ద జరిపిన దాడిలో ఒక నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.24,50,000 విలువైన 48 కిలోల ఎండు గంజాయిని, ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ డిసిపి వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ తెలిపారు. డీసీపీ కథనం ప్రకారం.. బీహార్ కు చెందిన నిందితుడు గతంలో 'బ్లింకిట్' డెలివరీ బాయ్ పనిచేసేవాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశతో, తన గ్రామానికి చెందిన అంకిత్ కుమార్ అలియాస్ శివతో కలిసి గంజాయి రవాణా వ్యాపారంలోకి దిగాడు.
ఢిల్లీకి చెందిన బండియా అనే వ్యాపారి సూచనల మేరకు, వీరు విశాఖపట్నం వచ్చి అక్కడి స్థానిక సరఫరాదారులైన నౌషాద్ (అలియాస్ సునీల్), రాజేష్లతో గంజాయి కొనుగోలు చేశారు. విశాఖ నుండి 24 ప్యాకెట్లలో చుట్టిన 48 కిలోల ఎండు గంజాయిని రెండు ఎయిర్ క్యారీ బ్యాగులు, రెండు పెద్ద బ్రీఫ్ కేసులలో దాచి రైలు మార్గంలో సికింద్రాబాద్ చేరుకున్నారు. అక్కడ నుండి నాంపల్లికి ఆటోలో వచ్చాక, ప్రధాన సూత్రధారి అంకిత్ కుమార్ ఢిల్లీ రైలు వేళలు చూసొస్తానని చెప్పి వెళ్లిపోయాడు. మిగిలిన సరుకుతో నిందితుడు సిటీ కన్వెన్షన్ సెంటర్ వద్ద వేచి చూస్తుండగా, పక్కా సమాచారంతో ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు అబిడ్స్ పోలీసులు పోలీసులు కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఢిల్లీకి చెందిన బండియా, విశాఖపట్నంకు చెందిన నౌషాద్, రాజేష్ మరియు బీహార్కు చెందిన అంకిత్ కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశామని పోలీసులు వెల్లడించారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్లో ప్రతిభ చూపిన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి. రాఘవేందర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ కె.ప్రసాద్ రావు, ఎస్.ఐ జి. శ్రీకాంత్ తో పాటు సిబ్బందిని డిసిపి అభినందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు