
హనుమకొండ, 24 ఆగస్టు (హి.స.)
రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తుందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకొని బాగా చదువుకోవాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. సోమవారం హనుమకొండ గోకుల్ నగర్ లోని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరును, సిబ్బంది వివరాలు, వంటకు ఉపయోగించే పప్పు దినుసులు, బియ్యం, గుడ్ల నాణ్యత, పరిశీలించి వాటి సరఫరా గురించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులు బాగా చదువుకోవాలని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రయత్నిస్తూ సమయాన్ని వృధా చేయకుండా ఒక లక్ష్యం పెట్టుకొని అందుకు తగ్గట్టు గా కష్టపడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి బీసీ సంక్షేమ అధికారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు