ప్రజావాణిలో వినతిని అరగంటలోనే పరిష్కరించిన జనగామ జిల్లా కలెక్టర్
ప్రజావాణిలో వినతిని అరగంటలోనే పరిష్కరించిన జనగామ జిల్లా కలెక్టర్
Collector


జనగామ, 24 ఆగస్టు (హి.స.)

ప్రజల సమస్యలను వేగంగా

పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం మరోసారి ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచింది.

అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్యను ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా దృష్టికి తీసుకెళ్లిన అరగంటలోనే పరిష్కరించి చిన్నారి చికిత్సకు మార్గం సుగమం చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని బాణాపురం కాలనీకి చెందిన మహమ్మద్ రఫత్ రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయన ఏడాది వయసున్న కుమార్తె మహమ్మద్ అల్ఫియనూర్ కంటి సమస్యతో బాధపడుతోంది. హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయాల్సి ఉందని వైద్యులు సూచించగా, ఇందుకు సుమారు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చవుతుందని తెలిపారు. అయితే చిన్నారి పేరు ఆరోగ్యశ్రీ కార్డులో నమోదు కాకపోవడంతో ఉచిత వైద్య సేవలు పొందే అవకాశం లేక కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. సమస్య పరిష్కారం కోసం ముందుగా మీ-సేవ కేంద్రాన్ని ఆశ్రయించినా ఫలితం లేకపోయిందని, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లినప్పుడు హైదరాబాద్ ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్సకు సంబంధించిన లేఖ తీసుకురావాలని సూచించారని రఫత్ తెలిపారు. చివరి ఆశగా ప్రజావాణి గడప తొక్కిన రఫత్కు కలెక్టర్ తక్షణ స్పందన లభించింది. చిన్నారి పరిస్థితిని తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికార యంత్రాంగం వేగంగా స్పందించడంతో అరగంట వ్యవధిలోనే చిన్నారి అల్ఫియనూర్ పేరు ఆరోగ్యశ్రీ కార్డులో నమోదు అయింది. దీంతో చిన్నారికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అవసరమైన వైద్యం, శస్త్రచికిత్స పొందేందుకు మార్గం సుగమమైంది. ఈ సందర్భంగా మహమ్మద్ రఫత్ మాట్లాడుతూ.. తమలాంటి నిరుపేద కుటుంబం సమస్యను వెంటనే పరిష్కరించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande