కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ కేసులో మరో ముగ్గురి అరెస్ట్.. కొనసాగుతున్న వేట!
కొండా సురేఖ మాజీ ఓఎస్టీ సుమంత్ కేసులో మరో ముగ్గురి అరెస్ట్.. కొనసాగుతున్న వేట!
Minister


హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)

తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డ్ సుమంత్ ప్రధాన నిందితుడిగా ఉన్న దాడి, హత్యాయత్నం కేసులో దర్యాప్తు వేగవంతమైంది. తాజాగా ఈ కేసులో మరో ముగ్గురిని ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్టూరులో అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. తాజాగా అరెస్టయిన వారిలో అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తీక్ రెడ్డి ఉన్నారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. (ఇంతకుముందే సుమంత్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే).

రియల్టర్ హరికృష్ణను రూ.10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు, ఆయనపై ఇనుప రాడ్లతో దారుణంగా దాడి చేసి హత్యకు యత్నించారనే ఆరోపణలపై సుమంత్ సహా పలువురిపై ఈ నెల 20న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సుమంత్ కోసం పోలీసుల గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది. ఉస్మాన్నగర్ (కొల్లూరు పీఎస్ పరిధి) ఓజోన్ హైట్స్లోని అతడి నివాసంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ప్రత్యేక బృందం నిఘా పెట్టినా అతను దొరకలేదు. అదే సమయంలో ఇంటి ముందు ఉన్న అతడి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సుమంత్తో పాటు పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande