
హుస్నాబాద్, 24 ఆగస్టు (హి.స.)
గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చిగురుమామిడి మండలం కొండాపూర్లో సోమవారం 'పల్లె పల్లెకు పొన్నం అన్న - పల్లె పల్లెలో ప్రజా పాలన' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి.. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గౌరవెల్లి ప్రాజెక్టు భూసేకరణ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.250 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. మూడు జిల్లాల కలెక్టర్లు భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని చెప్పారు. కాల్వల నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. భూములు సేకరించిన వెంటనే అర్హులైన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా ఆరుతడి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఆయిల్ఫామ్ సాగుతో అధిక లాభాలు పొందే అవకాశం ఉందని, రైతులు ఈ పంట సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా ఒడిసి పట్టేందుకు ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు. కొండాపూర్లో గుడిసెల్లో నివసిస్తున్న ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు. గుడాల భాగ్య నిర్మించుకున్న నూతన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. రూ.20 లక్షలతో నిర్మించనున్న మహిళా సంఘాల భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు