
రామగుండం, 24 ఆగస్టు (హి.స.)
పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో ఎన్ఐఏ అధికారుల సోదాలు స్థానికంగా కలకలం రేపాయి. కోర్టు అనుమతితో గుజరాత్ నుంచి వచ్చిన అధికారుల బృందం రామగుండంలోని ఓ యువకుడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే.. రామగుండానికి చెందిన ఓ యువకుడు ప్రస్తుతం పెద్దపల్లిలో డిప్లొమా రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతని టెలిగ్రామ్ గ్రూపులోని వ్యక్తులు, వారి మధ్య చట్ట వ్యరేతిక కార్యకలాపాలపై జరిగిన ఆన్లైన్ సంభాషణలు, యువకుడికి ఉన్న సంబంధాలపై సమాచారం రావడంతో ఉదయాన్నే అధికారులు రంగంలోకి దిగారు. టెలిగ్రామ్ గ్రూపులోకి వ్యక్తుల వివరాలపై ఆరా తీసినట్లు సమాచారం. ముఖ్యంగా టెలిగ్రామ్లోని వ్యక్తులకు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. తనిఖీల అనంతరం అతడికి సంబంధించిన డిజిటల్ పరికరాలను అధికారులు పరిశీలించి, ల్యాప్టాప్, ఫోన్ సహా అన్నీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
సంబంధిత యువకుడిని అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. యువకుడికి ఏదైనా నేరపూరిత సంబంధం ఉన్నట్లు అధికారికంగా నిర్ధారణ కాలేదు. పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడైతేనే ఈ వ్యవహారానికి సంబంధించిన అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..