
రాజన్న సిరిసిల్ల, 24 ఆగస్టు (హి.స.)
అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే మండల స్థాయి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుండగా, ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా వివిధ శాఖల మండల స్థాయి అధికారుల హాజరును పరిశీలించారు. గత వారం ప్రజావాణికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? తదితర అంశాలపై ఆరా తీశారు. చేయూత నూతన పెన్షన్ ల కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయని అడిగి తెలుసుకున్నారు. ఆయా దరఖాస్తులను పరిశీలించారు. చేయూత పెన్షన్ కోసం కావలసిన వివిధ ధ్రువీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులు త్వరితగతిన అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంతో పాటు ఆయా రెవెన్యూ డివిజన్ల కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు. ఆయా మండలాల ప్రజలు తమ మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు