
హైదరాబాద్, 24 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో విద్యుత్ కనెక్షన్లకు దశల వారీగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) అన్నారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల (smart meters) అమలకు ప్రభుత్వం ప్రజల బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం చేస్తోందని ఇందులో భాగంగానే విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల మాటలు, ఇటీవల నెక్లెస్ రోడ్డులో స్మార్ట్ మీటర్ల ఉపయోగం పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసిన కవిత.. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన కాకుండా పెద్దల పక్షాన ఉందని పదే పదే నిరూపించుకుంటోందని దుయ్యబట్టారు.
కార్పొరేట్లతో కుమ్మకై విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టి పేద ప్రజలకు ఇచ్చే సబ్సిడీ ఎత్తేయాలనే కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం తెరలేపిందని కవిత ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వాళ్లు తీసుకొస్తున్న తలా తోక లేని విధానాలను సమర్థిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న మీటర్లన్నీ స్మార్ట్ మీటర్లేనని, ప్రస్తుతం రీడింగ్ కోసం పెన్ను పేపతో ఏమీ రాసుకోవడం లేదు కదా అని ప్రశ్నించారు. రైతు నల్ల చట్టాల ద్వారా రైతులకు ఏ స్మార్ట్ మీటర్లు పెట్టాలని చూసిందో అదే అదానీ కంపనీకి చెందిన స్మార్ట్ మీటర్లను మరో కొత్త పథకం పేరుతో కేంద్రం తీసుకురావాలని చూస్తే ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టి స్మార్ట్ మీటర్లు పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. అదానీలకు కొమ్ము కాస్తూ స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, గృహ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే యూపీలో ఇలాంటి స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాటిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు