
శ్రీ సత్యసాయి జిల్లా, 24 ఆగస్టు (హి.స.)
శ్రీ సత్యసాయి జిల్లా లో ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకున్నాయని, నీటిని పొదుపుగా వాడాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. 15 ఏళ్లుగా ఇలాంటి విపత్కర పరిస్థితులను చూడలేదని పేర్కొన్నారు. సాగు చేసిన పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో రైతులు పరిస్థితిని అర్థం చేసుకుని, కొత్తగా బోరుబావులు వేయడాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో బోర్ల కోసం పోటీ పడకుండా సహకరించాలని రైతులను కోరారు. తీవ్రమైన ఎల్నినో ప్రభావాన్ని అందరూ సమష్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ భరోసా ఇచ్చారు. హంద్రీ–నీవా ద్వారా చెర్లోపల్లి రిజర్వాయర్కు నీటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెర్లోపల్లి రిజర్వాయర్ను పూర్తిస్థాయిలో నీటితో నింపేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకోవద్దని, నీటి సంరక్షణలో ప్రభుత్వానికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ