మాది ఓట్లు చీల్చే పార్టీ కాదు.. ప్రత్యర్థులకు అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ వార్నింగ్
మాది ఓట్లు చీల్చే పార్టీ కాదు.. ప్రత్యర్థులకు అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ వార్నింగ్
Mim


హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తప్పకుండా పోటీ చేస్తుందని, అయితే ఎన్ని స్థానాల్లో బరిలోకి దిగుతామనే అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) తెలిపారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. యూపీలో ఎంఐఎం సంస్థాగతంగా మునుపటి కంటే చాలా పుంజుకుందని అన్నారు. ఈసారి గతంలో కంటే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఏ స్థానాల్లో, ఎంతమంది అభ్యర్థులను నిలబెడతామనే వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని అసదుద్దీన్ ఒవైసీ వెల్లడించారు.

ఏఐఎంఐఎం పార్టీపై నిరంతరం ఓట్లు చీల్చే పార్టీ అంటూ వస్తున్న ఆరోపణలను అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి అసత్య ప్రచారాల ద్వారా ఎన్డీయే (NDA) అధికారంలోకి వస్తుందనే భ్రమలను కల్పించేందుకు ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. కొందరు నాయకులు వల్లించే లౌకికవాదానికి (Secularism), క్షేత్రస్థాయి వాస్తవాలకు ఎలాంటి సంబంధం లేదని అసదుద్దీన్ ఒవైసీ ఎద్దేవా చేశారు. ప్రజలు ఇప్పుడు తమ స్వంత రాజకీయ నాయకత్వాన్ని బలపరుచుకోవాలనే నిశ్చయంతో ఉన్నారని, ఏఐఎంఐఎం ఓ బలమైన ప్రత్యామ్నాయంగా మారుతోందని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు. బిహార్ ఎన్నికల ఫలితాలు ఈ ఆలోచనకు మరింత బలాన్ని ఇచ్చాయని పేర్కొన్నారు. రాబోయే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తారని అసదుద్దీన్ ఒవైసీసీ ఆశాభావం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande