
హైదరాబాద్, 27 ఆగస్టు (హి.స.)
చదువుతో పాటు క్రీడలకు కూడా
సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఈఎఫ్ఎల్ఎ యూ) ఓయూ క్యాంపస్లో నిర్వహించిన ఖేలో ఇండియా సంభాషణ—ప్రధానితో క్రీడల మాట కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 1,500 విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, యువ క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోదీ ఆన్లైన్ ద్వారా మాట్లాడారని, ఈ కార్యక్రమంలో దాదాపు 10 లక్షల మంది పాల్గొన్నారని కిషన్రెడ్డి తెలిపారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా తీసుకుందని, గతంలో క్రీడల పట్ల నిర్లక్ష్య వైఖరి ఉండేదని అన్నారు. ప్రస్తుతం గ్రామీణ స్థాయి నుంచే క్రీడలను ప్రోత్సహిస్తుండటంతో భారత క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ పోటీలకు వెళ్లే క్రీడాకారులను ప్రధాని మోదీ స్వయంగా కలుసుకుని ప్రోత్సహిస్తారని, విజయం సాధించిన వారికి అభినందనలు తెలియజేయడంతో పాటు ఓటమి ఎదురైన వారికి ధైర్యం చెబుతూ అండగా నిలుస్తారని చెప్పారు. క్రీడాకారులకు అవసరమైన పౌష్టికాహారం, ఆధునిక శిక్షణ, ప్రపంచస్థాయి కోచ్ల వద్ద శిక్షణ పొందే అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.
2030 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో, 2036 ఒలింపిక్ క్రీడలను కూడా దేశంలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత క్రీడారంగాన్ని తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి భారత క్రీడారంగాన్ని తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థల నిర్వాహకులు చదువుతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహించాలని, అందరి సమిష్టి కృషితో ప్రపంచ క్రీడా రంగంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని కిషన్రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు