
తిరుమల, 28 ఆగస్టు (హి.స.)కలియుగ వైకుంఠమైన తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ పూర్తిగా నిండిపోయాయి. కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో వేచి ఉన్నారు. ఎలాంటి సమయ నిర్దేశిత టోకెన్లు లేని సాధారణ భక్తులకు స్వామివారి సర్వదర్శనం లభించడానికి దాదాపు 20 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఇబ్బందులు కలగకుండా పాలు, తాగునీరు, అన్నప్రసాదాలు టీటీడీ సిబ్బంది నిరంతరం అందజేస్తున్నారు.
ఇదిలా ఉంటే గురువారం కూడా భక్తుల రద్ధీ కొనసాగగా.. మొత్తం 66,437 మంది భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 26,771 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నిన్న భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామి వారి హుండీకి రూ.4.45 కోట్ల భారీ ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV