
న్యూఢిల్లి, 03 ఆగస్టు (హి.స.)
హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా మళ్లీ సాధారణ స్థితికి రావడంతో భారతీయ రిఫైనరీలు పశ్చిమాసియా దేశాల నుంచి కొనుగోళ్లను పెంచుతున్నప్పటికీ, రష్యా మాత్రం భారత్కు అతిపెద్ద ముడి చమురు సరఫరాదారుగానే కొనసాగుతోంది. కెప్లర్ షిప్-ట్రాకింగ్ డేటా ప్రకారం, జూలైలో భారత్ రోజుకు 5 మిలియన్ (50 లక్షల) బ్యారెళ్లకు పైగా ముడి చమురును దిగుమతి చేసుకోగా, అందులో రష్యా నుంచి వచ్చిన చమురు రోజుకు 2.8 మిలియన్ (28 లక్షల) బ్యారెళ్లకు చేరింది. ఇది ఇప్పటివరకు నమోదైన అత్యధిక స్థాయి. దీంతో భారత మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 55.5 శాతానికి చేరుకుంది. 2022లో ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రాయితీ ధరలకు రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడం ప్రారంభించిన భారత్, ఇప్పుడు రాయితీలు దాదాపు తగ్గిపోయినా సరఫరా విశ్వసనీయత కారణంగా అదే స్థాయిలో కొనుగోళ్లు కొనసాగిస్తోంది. రష్యా రిఫైనరీలపై డ్రోన్ దాడులతో అక్కడ దేశీయ శుద్ధి తగ్గడం వల్ల ఎగుమతులకు మరింత ముడి చమురు అందుబాటులోకి రావడం కూడా దీనికి ఒక కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
అదే సమయంలో పశ్చిమాసియా నుంచి సరఫరా కూడా వేగంగా పుంజుకుంటోంది. జూన్లో రోజుకు 2.9 లక్షల బ్యారెళ్లుగా ఉన్న సౌదీ అరేబియా ఎగుమతులు జూలైలో 4.2 లక్షల బ్యారెళ్లకు పెరిగాయి. ఏప్రిల్లో పూర్తిగా ఆగిపోయిన ఇరాక్ సరఫరా మే నుంచి తిరిగి ప్రారంభమై, జూలైలో 1.3 లక్షల బ్యారెళ్లకు చేరుకున్నాయి. మూడు నెలల విరామం తర్వాత కువైట్ కూడా మళ్లీ భారత మార్కెట్కు చమురు సరఫరా ప్రారంభించింది. మరోవైపు యూఏఈ నుంచి దిగుమతులు స్వల్పంగా తగ్గినా, అది భారత్కు రెండో అతిపెద్ద సరఫరాదారుగా కొనసాగుతోంది. మరోవైపు, భారత్ ఎల్పీజీ దిగుమతుల్లో అమెరికా ఆధిపత్యం మరింత బలపడింది. జూలైలో దిగుమతి చేసిన 1.2 మిలియన్(12 లక్షల) టన్నుల ఎల్పీజీలో సుమారు 9 లక్షల టన్నులు, అంటే 73 శాతం అమెరికా నుంచే వచ్చాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు