కర్ణాటక కాంగ్రెస్లో భగ్గుమన్న అసంతృప్తి జ్వాలలు.. పదవులకు ఎమ్మెల్యేల రాజీనామాలు
కర్ణాటక కాంగ్రెస్లో భగ్గుమన్న అసంతృప్తి జ్వాలలు.. పదవులకు ఎమ్మెల్యేల రాజీనామాలు
Karnataka


కర్ణాటక, 03 ఆగస్టు (హి.స.)

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర

అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ వేళ పార్టీ అధిష్ఠానానికి ఊహించని షాక్ తగిలింది. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందు కేబినెట్లో చోటు దక్కలేదని తీవ్ర తీవ్ర అసంతృప్తికి గురైన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఇండి (Indi) నియోజకవర్గ ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ వి. పాటిల్, సాగర్ (Sagar) నియోజకవర్గ ఎమ్మెల్యే బెళూరు గోపాలకృష్ణ తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

క్షణాల్లో మారిన జాబితా.. అసంతృప్తిలో నేతలు

ఎమ్మెల్యే యశ్వంతరాయగౌడ పాటిల్ విధాన సౌధలో డిప్యూటీ స్పీకర్ రుద్రప్ప లమాణిని కలసి తన రాజీనామా లేఖను సమర్పించారు. పాటిల్కు మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన మద్దతుదారులు బెంగళూరులో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. మరోవైపు సాగర్ ఎమ్మెల్యే బెళూరు గోపాలకృష్ణ కూడా అసెంబ్లీకి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ నాయకత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. రాజీనామా అనంతరం యశ్వంతరాయగౌడ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఉదయం వరకు విడుదలైన జాబితాలో నా పేరు ఉంది, నాకు అధికారిక సమాచారం కూడా వచ్చింది. కానీ చివరి నిమిషంలో ప్రకటించిన ఆఖరి జాబితాలో నా పేరు కనిపించలేదు. పార్టీ అధిష్ఠానం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. విధిలేని పరిస్థితుల్లోనే రాజీనామా సమర్పించాను. కాంగ్రెస్ పార్టీలో విధేయతకు, నిజాయితీకి విలువ లేకుండా పోయింది. తాను పదవుల కోసం ఆరాటపడటం లేదని, 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని పాటిల్ గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడిన సమయంలో రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్లోకి తీసుకుంటామన్నారు, కానీ ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఇప్పటివరకు 8 ఎన్నికలు ఎదుర్కొన్న పరిణతి చెందిన రాజకీయనాయకుడిని నేను. ఇది నా నియోజకవర్గ ప్రజలకు జరిగిన అవమానం. నేను పార్టీని వీడటం లేదు, కానీ రాజీనామా చేసే వాతావరణాన్ని వాళ్లే కల్పించారు అని పేర్కొన్నారు.

కేబినెట్ విస్తరణ నేపథ్యం

డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల తర్వాత ఈ కేబినెట్ విస్తరణ చేపట్టారు. కొత్తగా కేబినెట్ లోకి తీసుకున్న 20 మంది మంత్రులు బెంగళూరులోని లోక్ భవన్లో సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. ఈ విస్తరణలో స్థానం దక్కని పలువురు సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కొందరు కార్పొరేషన్ చైర్మన్ పదవులకు కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలు కర్ణాటక కాంగ్రెస్ సర్కారులో అంతర్గత కలహాలను మరింత తీవ్రతరం చేశాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande