బిహార్ రాజకీయాల్లో సంచలనం.. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన పీకే: బంకీపూర్లో గెలుపు
బిహార్ రాజకీయాల్లో సంచలనం.. బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన పీకే: బంకీపూర్లో గెలుపు
Bihar election


న్యూఢిల్లీ, 03 ఆగస్టు (హి.స.)

దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన

బిహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సంచలన ఫలితం నమోదైంది. జన సురాజ్ పార్టీ (JSP) అధినేత, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఘన విజయం సాధించారు. తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగిన పీకే, సమీప బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 10 వేలకు పైగా ఓట్లు మెజార్టీతో విజయం సాధించి చట్టసభలోకి అడుగుపెడుతున్నారు. పాట్నా పరిధిలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం గత మూడు దశాబ్దాలుగా (1995 నుంచి) భారతీయ జనతా పార్టీకి తిరుగులేని కంచుకోటగా ఉంది. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన నితిన్ నబీన్ వరసగా ఐదుసార్లు విజయం సాధించారు. నితిన్ నబీన్ ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికై, రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. తన సొంత స్థానం కావడంతో పాటు అధికారంలో ఉండటంతో గెలుపు నల్లేరుపై నడకేనని భావించిన బీజేపీకి ప్రశాంత్ కిషోర్ ఊహించని షాక్ ఇచ్చారు.

మొదటి ప్రయత్నంలోనే గ్రాండ్ ఎంట్రీ..

గతంలో పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసి అద్భుత విజయాలను అందించిన ప్రశాంత్ కిషోర్, ఆ తర్వాత 'జన సురాజ్' పేరుతో సొంత పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నికను పీకే ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించారు. ఈ విజయం బిహార్ రాజకీయాల్లో నూతన శకానికి నాంది అని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు పూర్తవ్వడంతో కాసేపట్లో ఎన్నికల కమిషన్ దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.

బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితంతో బిహార్ప్రజలు బీజేపీ కేంద్ర నాయకత్వానికి స్పష్టమైన సందేశం ఇచ్చారని జన సురాజ్ పార్టీ నేత ప్రశాంత్ కిశోర్ అన్నారు. బిహార్ ముఖ్యమంత్రిగా మంచి వ్యక్తిని ఎంపిక చేయాలని, రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు. బిహార్ ప్రజలు ఎన్డీయేకు 202 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. ఆ బాధ్యతను నాయకత్వం సరిగ్గా వినియోగించాలి. నేర చరిత్ర ఉన్నవారికి కాకుండా, నిజాయితీగా పనిచేసే వ్యక్తికి నాయకత్వం ఇవ్వాలి” అని ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యానించారు. బిహార్లో విద్యా వ్యవస్థ మెరుగుపడాలని, యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలని, ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి తగ్గాలని ఆయన అన్నారు. గుజరాత్ అభివృద్ధిపై ఎంత శ్రద్ధ చూపుతున్నారో, 13 కోట్ల జనాభా ఉన్న బిహార్పైనా అంతే శ్రద్ధ చూపాలని కేంద్రాన్ని కోరారు.

బిహార్ పిల్లలు రూ. 10-15 వేల జీతాల కోసం కుటుంబాలను వదిలి గుజరాత్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి మారాలి” అని ఆయన అన్నారు. కులం, మతం, ఉచిత రేషన్ అంశాలకే పరిమితం కాకుండా విద్య, ఉపాధి, అభివృద్ధి ఆధారంగా రాజకీయాలు సాగాలని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. “30 ఏళ్లుగా ఉన్న రాజకీయ కోట కేవలం 20 రోజుల్లో కదిలింది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారనే సంకేతం ఇది” అని అన్నారు. బిహార్ భవిష్యత్తు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande