
సిద్దిపేట, 30 ఆగస్టు (హి.స.)
గంజాయి అక్రమ రవాణా,విక్రయానికి పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేసి వారి నుంచి 430 గ్రాముల గంజాయి, గంజాయి రవాణాకు ఉపయోగించిన టీఎస్ 06ఎఫ్ఎఫ్ 3588 నెంబర్ గల గిక్సార్ ద్విచక్ర వాహనం, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు జగదేవపూర్ ఎస్ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం ఉదయం మండల కేంద్రమైన జగదేవపూర్ శివారులోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో అనుమానాస్పదంగా ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేయగా అదుపులోకి తీసుకొని విచారించారు.
విచారణలో మునిగడపకు చెందిన దేవుని అలియాస్ కొజ్జాల్ల నవీన్ కుమార్ (25), జగదేవపూర్కు చెందిన చీలసాగర్ పవన్ కళ్యాణ్ (26)గా గుర్తించారు. బైక్ సీటు కింద ప్లాస్టిక్ కవర్లలో దాచిన 430 గ్రాముల గంజాయిని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా-సీలేరు సరిహద్దు ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి, కొంత వినియోగించడంతోపాటు మిగిలినదాన్ని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై ఎన్ డీపీఏస్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు