
హైదరాబాద్, 30 ఆగస్టు (హి.స.)
దివ్యాంగులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదంటూ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ రెండు దఫాలు అధికారంలో ఉండి దివ్యాంగులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని 2023 ఎన్నికల మేనిపెస్టోలో దివ్యాంగుల అంశాన్ని కూడా మేనిపెస్టోలో చేర్చలేదని విమర్శించారు. పదేళ్లు వికలాంగుల హామీలను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన మంత్రి దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, వారి సంక్షేమం కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు.
దివ్యాంగులు వివాహం చేసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఇచ్చారా అని అడ్లూరి నిలదీశారు. మీ హయాంలో ఏం చేశారో చెప్పడానికి ఏం లేక.. మాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మేము వచ్చాక దివ్యాంగులకు రూ.50 కోట్లు ఖర్చు చేసి వాహనాలు ఇచ్చామని పుట్టుకతో అంగ వైకల్యంతో ఉన్న వారికి బాల్ భరోసా, వికలాంగులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామన్నారు. మేము ప్రజలకు ఇచ్చిన ప్రతీ ఒక్క హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు