
నారాయణపేట, 30 ఆగస్టు (హి.స.)
మక్తల్ నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన
లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పదవులు శాశ్వతం కాదని, ప్రజలకు చేసిన సేవలు, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే చిరస్థాయిగా గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం మక్తల్లోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామ పంచాయతీల వారీగా మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై అధికారులతో చర్చించారు. నియోజకవర్గంలోని 284 బూత్ల పరిధిలో అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో బూతు 10 నుంచి 12 ఇళ్ల చొప్పున కేటాయింపు జరుగుతోందని, ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా అర్హత ఉన్న వారినే ఎంపిక చేస్తున్నామని చెప్పారు. సుమారు రూ.276 కోట్ల వ్యయంతో 5,500 ఇందిరమ్మ ఇళ్లు మక్తల్ నియోజకవర్గానికి మంజూరు కావడం సంతోషకరమన్నారు.
నియోజకవర్గంలో 68 వేల రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రతి అర్హత కలిగిన పేద కుటుంబానికి నెలకు 6 కిలోల సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..