
కరీంనగర్, 30 ఆగస్టు (హి.స.)
గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా వద్ద కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మంగపేట గ్రామానికి చెందిన కూలీలు ఆటోలో ప్రయాణిస్తుండగా.. వెనుక నుంచి వచ్చిన కోళ్ల వ్యాను ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మంగపేట గ్రామానికి చెందిన లింగాల దేవమ్మ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం. పలువురు మహిళలు గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ఒక్క ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
ప్రమాద విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం కరీంనగర్లోని ఆసుపత్రులకు వెళ్లి ప్రమాద బాధితులను పరామర్శించారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు