భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో చరిత్రాత్మక మార్పు..40 శాతం దాటిన నాన్-పెట్రోల్ విక్రయాలు..
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో చరిత్రాత్మక మార్పు..40 శాతం దాటిన నాన్-పెట్రోల్ విక్రయాలు..
AutomobileAutomobile


హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఒక చరిత్రాత్మక మార్పు చోటుచేసుకుంటోంది. దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం వహించిన పెట్రోల్, డీజిల్ కార్ల యుగం ముగిసిపోతోందా? అంటే అవుననే విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. దేశీయ రోడ్లపై క్రమంగా ఎలక్ట్రిక్ (ఈవీ), సీఎన్జ, హైబ్రిడ్ వాహనాల హవా గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ విక్రయాల ఆధారంగా చూస్తే నాన్ పెట్రోల్ వాహన విక్రయాల జోరు కనిపిస్తోంది. ఇదే వేగంతో వెళ్తే భవిష్యత్తులో కాలుష్యం లేని వాహనాలే రోడ్లపైన తిరిగే రోజులు వచ్చేలా కనిపిస్తోంది.

ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) విడుదల చేసిన తాజా సేల్స్ డేటా ప్రకారం.. దేశంలో అమ్ముడవుతున్న మొత్తం కొత్త కార్లలో పెట్రోలు, డీజిలేతర (ఆల్టర్నేటివ్ ఫ్యూయల్) వాహనాల వాటా తొలిసారిగా 40.35 శాతానికి చేరింది. అంటే ప్రస్తుతం విక్రయమౌతున్న మొత్తం కార్లలో సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ మోడళ్ల వాటా 60 శాతానికంటే తక్కువకు పడిపోవడం గమనార్హం. నాన్-పెట్రోల్ విభాగంలో అత్యధికంగా 24.3% వాటాతో సీఎన్జీ కార్లు అగ్రస్థానంలో ఉన్నాయి. సీఎనీ బంకుల నెట్వర్క్ విస్తరించడంతో పెరుగుదలకు కలిసివచ్చింది. అటు పెట్రోల్, ఇటు ఎలక్ట్రిక్ బ్యాటరీ రెండింటి సాయంతో నడిచే హైబ్రిడ్ వాహనాల వాటా 8.3 శాతంగా ఉంది. గత ఏడాది 7.97% శాతాంగా వీటి వాటా ఉండేది. వీటిలో ప్రత్యేక చార్జింగ్ అవసరం లేకుండానే 30% నుంచి 40% వరకు ఇంధన సామర్థ్యం పెరుగుతుంది. ఇక ఈవీలు సైతం ఊహించని విధంగా అమ్ముడవుతున్నాయి. ఈవీ కార్ల వాటా ఏకంగా 7.8 శాతానికి చేరింది. గత ఏడాది జూన్లో ఇది 4.80% ఉండేది. పెరిగిన ఇంధన భారం, ధరల అస్థిరత వల్ల ఈ షిఫ్ట్ కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా యుద్ధాల కారణంగా ముడిచమురు ధరలు పెరిగాయి. గ్లోబల్ మార్కెట్లో ధరలు తగ్గినా, ఆ లబ్ధి పన్నుల రూపంలో ప్రభుత్వాల వద్దే ఉండిపోవడంతో పెట్రోల్ ధర రూ. 100 దాటి స్థిరపడింది. దీంతో తక్కువ రన్నింగ్ కాస్ట్ ఉండే ఈవీ, సీఎనీ వాహనాల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. సీఎనీ స్టేషన్లతోపాటు పట్టణాల్లో హోమ్ చార్జింగ్, పబ్లిక్ చార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి వస్తున్నాయి.

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ కొరత వాహనదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. దీంతో ఈ ఏడాది మార్చి నుంచి ఈవీల విక్రయాలు బాగా పెరిగాయి. మా షోరూంల పరిధిలోనే ఈ ఏడాది మార్చిలో 92, ఏప్రిల్లో 150, మేలో 250, జూన్లో 159, జులైలో 175 ఈవీలను విక్రయించాం. యుద్ధం సమయంలో పెట్రోల్, డీజిల్ కోసం క్యూలో ఉండాల్సి రావడంతోపాటు అస్థిరంగా ఉన్న పెట్రో ధరలు సైతం వాహనదారులను ఆలోచింపచేసింది. గతంలో ఈవీల కోసం చార్జింగ్ సౌకర్యాలు పరిమితంగా ఉండేవి. ఇప్పుడు ఎక్కడెక్కడ చార్జింగ్ పాయింట్స్ ఉన్నాయో కూడా మొబైల్ యాప్లో తెలిసిపోతుంది. ప్రస్తుతం నగరవాసులే ఈవీలను ఎక్కువగా కొంటున్నారు. చార్జింగ్ పాయింట్స్ సంఖ్య బాగా పెరిగింది. అలాగే ఈవీ చార్జింగ్ పాయింట్స్ వల్ల హోటల్స్ వాళ్ల బిజినెస్ కూడా పెరిగింది. భోజనం చేసే లోపు చార్జింగ్ అవుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande