
హైదరాబాద్, 04 ఆగస్టు (హి.స.)
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 'E20' (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) ఇంధన విధానానికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుండి వస్తున్న అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి, అక్కడి నుండి భారీ ఎత్తున ఇథనాల్‌ను దిగుమతి చేసుకోవడానికే కేంద్రం ఈ విధానాన్ని మొండిగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన ఆరోపించారు. ఈ నిర్ణయం వెనుక పెద్ద ఎత్తున నిగూఢమైన ఆర్థిక ప్రయోజనాలు మరియు రహస్య ఒప్పందాలు ఉన్నాయని కేజ్రీవాల్ దుయ్యబట్టారు. ఈ విధానం వల్ల వాహనాల ఇంజన్లు పాడైపోవడమే కాకుండా సామాన్య ప్రజలపై అదనపు భారం పడుతుందని, కాబట్టి పెట్రోల్ బంకుల్లో సాధారణ పెట్రోల్ లభ్యతను కూడా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి వ్యతిరేకంగా దాదాపు వంద మంది ముఖ్య ప్రతినిధులతో కలిసి న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసానికి నిరసన ర్యాలీగా వెళ్లి స్వయంగా వినతిపత్రం అందజేస్తామని ప్రకటించడంతో జాతీయ రాజధానిలో భారీగా భద్రతను పెంచారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi