
అమరావతి, 07 ఆగస్టు (హి.స.)
మధురానగర్, విజయవాడ ప్రభుత్వ ముద్రణాలయం సమీపంలో వైకాపా మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తన అనుచరులతో కలిసి చేపట్టిన రిలే నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్లు కారణమంటూ.. వైకాపా శ్రేణులు నినాదాలు చేశారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు తన అనుచరులతో కలిసి దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. ధర్నా చౌక్లో కాకుండా ముత్యాలంపాడు బస్టాప్ వద్ద టెంట్ వేసి.. ప్రజలకు అసౌకర్యం కలిగించడం ఏంటంటూ బొండా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తెదేపా, వైకాపా శ్రేణుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ.. ఒకరినొకరు నెట్టుకున్నారు. ఇదే సమయంలో కొందరు తెదేపా కార్యకర్తలు.. టెంట్ను లాగేశారు. వైకాపా బ్యానర్లను చించివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, టమాటాలు, కుర్చీలు విసురుకున్నారు. పోలీసులు అదుపు చేయడంతో ఇరువర్గాలు రోడ్డుపైన ఎదురెదురుగా బైఠాయించి.. నినాదాలు చేసుకున్నారు. రెండు గంటలకు పైగా ఈ వివాదం కొనసాగింది. పోలీసులు మల్లాది విష్ణు, వైకాపా నాయకులను అదుపులోకి తీసుకుని వాహనంలో ధర్నాచౌక్కు తీసుకెళ్లగా.. అక్కడ దీక్షను కొనసాగించారు. కాగా పలువురు మహిళా కార్యకర్తలు సొమ్మసిల్లిపడిపోగా.. సహచరులు సపర్యలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ