ఫీజు బకాయిలు చెల్లించాలని హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి
ఫీజు బకాయిలు చెల్లించాలని హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి
Collector


హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.)

రాష్ట్రంలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థులకు సంబంధించిన రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, జీవో నెం.9ను రద్దు చేసి పాత విధానంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద వేలాది మంది విద్యార్థులు భారీ ప్రదర్శన ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్ నాయకత్వంలో జరిగిన ఈ నిరసనలో వందలాదిమంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్ లు మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు మానుకోవాలని, విద్యార్థులపై భారాలు మోపే జీవో నెం.9ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల ఖాతాల్లో ఫీజులు జమ చేసి, చెల్లించకపోతే జైలుకు పంపుతామనే నిబంధనలు అమానుషమని విమర్శించారు. రూ.8 వేల కోట్ల బకాయిలు చెల్లించి పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జి. అనంతయ్య, సి. రాజేందర్, బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్ నిఖిల్ తదితర బీసీ విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande