
అమరావతి, 07 ఆగస్టు (హి.స.)
విజయవాడ, విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి ఆనంకు ఆలయ మర్యాదలతో ఈవో, ఆలయ చైర్మన్, అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆపై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానతరం వేద పండితుల ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను మంత్రి స్వీకరించారు. తరువాత ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి సూచించారు. వీఐపీ దర్శనాలతోపాటు సాధారణ భక్తుల దర్శనాలు కూడా సజావుగా కొనసాగేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ట్రాఫిక్ నిర్వహణ, పార్కింగ్, షటిల్ సర్వీసులు, అత్యవసర సేవలను ముందుగానే సిద్ధం చేయాలని సూచనలు చేశారు. ఆలయ పరిసరాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఆలయ మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడొద్దని అధికారులకు మంత్రి స్పష్టమైన సూచనలు చేశారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. దసరా ఉత్సవాలను రాష్ట్ర ప్రతిష్ఠకు తగ్గట్టుగా అత్యంత వైభవంగా నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం.. ఆలయాల అభివృద్ధి, భక్తుల సంక్షేమానికి కట్టుబడి ఉంది మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ