ఓయూ క్యాంపస్లో అక్రమ కార్యకలాపాలపై పోలీసుల ప్రత్యేక నిఘా
ఓయూ క్యాంపస్లో అక్రమ కార్యకలాపాలపై పోలీసుల ప్రత్యేక నిఘా
Police


హైదరాబాద్, 07 ఆగస్టు (హి.స.)

ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, నిషేధిత ప్రాంతాల్లో ధూమపానం చేయడం తదితర చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు ఓయూ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పగలు, రాత్రి వేళల్లో డీకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తూ అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు. యెల్లమ్మ దేవాలయం, ఎన్సీసీ గేట్, 100 ఇయర్స్ పైలాన్, ఆర్ట్స్ కాలేజ్ బస్టాప్, ఎన్ఆర్ఎస్ హాస్టల్ పరిసరాలు, మైక్రోబయాలజీ విభాగం, హైటెక్ హాస్టల్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఇటీవల యూనివర్సిటీ ప్రాంగణంలోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన కొందరు బయటి వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో బయటి వ్యక్తులతో పాటు యూనివర్సిటీ విద్యార్థులు, ఇతర ఇన్సైడర్స్పై కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, నిషేధిత ప్రాంతాల్లో ధూమపానం చేయడం లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఓయూ పోలీసులు హెచ్చరించారు. క్యాంపస్లో ప్రశాంతత, భద్రత, క్రమశిక్షణను కాపాడేందుకు విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande