ఉదయాన్నే సద్గురు తాగే సుక్కు మల్లి కాఫీ ప్రత్యేకత ఏంటి? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ఉదయాన్నే సద్గురు తాగే సుక్కు మల్లి కాఫీ ప్రత్యేకత ఏంటి? ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Sadhguru’s Morning Sukku Malli Coffee: Amazing Health Benefits


బెంగళూరు, 07 ఆగస్టు (హి.స.)ఉదయం లేవగానే చాలామందికి వేడివేడిగా టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. కానీ, శరీరాన్ని రోజంతా చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కేఫీన్ ఉండే పానీయాల కంటే సంప్రదాయ మూలికా పానీయాలు ఎంతో శ్రేయస్కరమని ఆధ్యాత్మిక వేత్త సద్గురు పేర్కొంటున్నారు. ఆయన ఉదయాన్నే తాగే సుక్కు మల్లి కాఫీ (సొంటి – ధనియాల డికాక్షన్) ప్రస్తుతం అనేకమంది దృష్టిని ఆకర్షిస్తోంది. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు, తయారీ విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.

ధనియాలు :

ఆయుర్వేదం ప్రకారం ధనియాలు శరీరంలో పిత్త దోషాన్ని నివారిస్తాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

సొంటి :

సొంటి జీర్ణక్రియను వేగవంతం చేసి, ఆకలిని పెంచుతుంది. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే జింజెరాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులను తగ్గిస్తుంది. ఉదయాన్నే వచ్చే వికారం, వాంతుల భావనను ఇది నయం చేస్తుంది.

తాటి బెల్లం:

ఈ పానీయంలో పంచదారకు బదులుగా తాటి బెల్లం ఉపయోగిస్తారు. ఇందులో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది పేగుల ఆరోగ్యానికి దోహదపడే ప్రీబయోటిక్గా పనిచేస్తుంది.

సుక్కు మల్లి కాఫీ తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు:

సొంటి – చిన్న ముక్క

ధనియాలు – 2 స్పూన్లు

యాలకులు – 1

మిరియాలు – 5

తాటి బెల్లం – తగినంత

తులసి ఆకులు – 6

తయారుచేసే పద్ధతి:

ముందుగా ఒక పాత్రలో రెండు గ్లాసుల నీటిని పోసి మరగబెట్టండి. ధనియాలను దోరగా వేయించి కచ్చాపచ్చాగా పొడి చేయండి. సొంటిని కూడా దంచి పక్కన పెట్టుకోండి. మరుగుతున్న నీటిలో ఈ పొడులను, మిరియాలు, యాలకులు, తులసి ఆకులను వేయండి. నీరు సగానికి మరిగే వరకు చిన్న మంటపై ఉంచండి.

ఆ తర్వాత డికాక్షన్ను వడకట్టి, తీపి కోసం తగినంత తాటి బెల్లం కలిపితే రుచికరమైన సుక్కు మల్లి కాఫీ సిద్ధమవుతుంది. రుచితో పాటు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన ఈ కేఫీన్ రహిత పానీయాన్ని రోజూ ఉదయాన్నే తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేసి రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande