
హైదరాబాద్, 08 ఆగస్టు (హి.స.) తెలంగాణలో నిరుద్యోగం (unemployment) ఏ స్థాయిలో ఉందో చూపించే ఘటన సరూర్నగర్ స్టేడియం వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (Hydraa)లో ఉద్యోగాల కోసం సరూర్నగర్ స్టేడియం (Saroornagar Stadium) వద్ద శనివారం తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. హైడ్రా లో ఖాళీగా ఉన్న 100 డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) అసిస్టెంట్లు, 50 హెవీ వెహికల్ డ్రైవర్లు.. మొత్తం 150 పోస్టుల భర్తీ కోసం ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటల నుంచి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న వేలాది మంది నిరుద్యోగ యువకులు శనివారం తెల్లవారుజామున స్టేడియం వద్దకు భారీగా తరలి రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట, తోపులాట వాతావరణం నెలకొంది.
ఈ ఉద్యోగాలకు ఎంపిక కావడానికి అభ్యర్థులు 170 సెకన్లలో 800 మీటర్ల రన్నింగ్, 15 సెకన్లలో 100 మీటర్ల పరుగు, 4 మీటర్ల లాంగ్ జంప్, 7.2 కిలోల బరువుండే షాట్పుట్ను 6 మీటర్లు విసరాల్సి ఉంటుందని హైడ్రా నిబంధన విధించింది. ఈ కఠినమైన ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించేందుకు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు భారీ సంఖ్యలో తరలిరావడంతో స్టేడియం ప్రాంగణం కిక్కిరిసిపోయింది. జనాన్ని అదుపు చేయడానికి సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో పోటెత్తడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్తత, గందరగోళ పరిస్థితి నెలకొంది. కాగా దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..