
గుంటూరు(తూర్పు), 01 సెప్టెంబర్ (హి.స.)
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెం దిన 8 మంది మాదిగ సామాజికవర్గానికి చెందిన పేద కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల పరిహారం ఇస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ప్రకటనను స్వాగతిస్తున్నట్టు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. పరిహారంలో జాప్యం, స్థానిక ఎమ్మెల్యే సరిగ్గా స్పందించకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్ల పైకి వచ్చి నిరసన తెలిపామన్నారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ మృతదేహాలు ఉన్న సమయంలోనే పరిహారం ప్రకటించి ఉంటే బాధిత కుటుంబాలకు కొంత భరోసా కలిగేదన్నారు. దళితులు బాధితులుగా ఉన్నప్పుడు స్పందనలో జాప్యం ఎందుకు జరుగుతోందని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు అన్ని వర్గాల బాధితుల పట్ల ప్రభుత్వం ఒకే విధమైన వేగంతో స్పందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ