లక్ష్య సాధనలో ప్రణాళికాబద్ధమైన స్మార్ట్ వర్క్ కీలకం.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
లక్ష్య సాధనలో ప్రణాళికాబద్ధమైన స్మార్ట్ వర్క్ కీలకం.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Collector


ఆదిలాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.)

పోటీ పరీక్షల్లో విజయ తీరాలకు చేరాలంటే కఠోర శ్రమతో పాటు ప్రణాళికాబద్ధమైన స్మార్ట్ వర్క్ ఎంతో అవసరమని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మెరిట్ అభ్యర్థులకు పోటీ పరీక్షల నిమిత్తం నిర్వహిస్తున్న ఫౌండేషన్ కోర్సు శిక్షణ తరగతులను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన పలువురు అభ్యర్థులు తమ అనుభవాలను, అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సిలబస్పై పూర్తి పట్టు సాధించి, పరిమితమైన ప్రామాణిక పుస్తకాలను మాత్రమే ఎంచుకోవాలని సూచించారు.

స్థిర అంశాలను సమకాలీన పరిణామాలతో అనుసంధానిస్తూ నోట్స్ తయారు చేసుకోవాలని, ఇది ప్రధాన పరీక్షల్లో సమాధానాల రచనకు ఎంతో దోహదపడుతుందని తెలిపారు. వస్తునిష్ఠ పరీక్షల్లో ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించడంలో తొలగింపు పద్ధతి కీలకమని చెప్పారు. ఇందుకోసం అధిక సంఖ్యలో నమూనా ప్రశ్నపత్రాలు, సాధన పరీక్షలను ప్రాక్టీస్ చేయాలని సూచించారు.

అభ్యర్థులు శిక్షణ, చదువు సమయంలో స్మార్ట్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు వంటి ఆటంకాలకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో సిద్ధం కావాలని కలెక్టర్ సూచించారు.

త్వరలో ప్రభుత్వం నుంచి పలు ఉద్యోగ ప్రకటనలు వెలువడనున్న నేపథ్యంలో బీసీ స్టడీ సర్కిల్ అందించే శిక్షణను, అధ్యాపకుల మార్గదర్శకత్వాన్ని అభ్యర్థులు నూటికి నూరు శాతం సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని నిరంతరం శ్రమిస్తే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని కలెక్టర్ తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande