బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హౌస్అరెస్ట్.. నల్గొండ పర్యటనకు బ్రేక్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హౌస్అరెస్ట్.. నల్గొండ పర్యటనకు బ్రేక్
Bjp


హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.)

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావును పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని గాంధీనగర్ పోలీస్టే స్టేషన్కు తరలించారు. నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి నివాసంపై దాడి జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు నల్గొండ వెళ్లేందుకు రామచందర్రావు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఆయనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. వర్షిత్రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ధ్వంసం చేశారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఘటనపై స్పందించడంతో పాటు బాధిత నాయకుడిని పరామర్శించేందుకు రామ్చందర్రావు నల్గొండ వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

దీంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు ఆయనను ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. అనంతరం రామచందర్రావునల్గొండకు బయలుదేరేందుకు ప్రయత్నించడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని గాంధీనగర్ పోలీస్టేషన్కు తరలించారు. తనను నిర్బంధించడంపై రామచందర్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను కలవడం, బాధితులను పరామర్శించడం వంటి ప్రజాస్వామ్య హక్కులను అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రతిపక్ష నాయకులకు తమ కార్యక్రమాలు నిర్వహించుకునే స్వేచ్ఛ కల్పించాలని కోరారు. ఇటీవల పాలిటెక్నిక్ విద్యార్థులను పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంలోనూ తనను పోలీసులు అడ్డుకున్నారని ఆయన పేర్కొన్నారు. వరుసగా నిర్బంధాలు, ఆంక్షలు విధించినా ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande