
నల్గొండ, 01 సెప్టెంబర్ (హి.స.)
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్,
బీజేపీ శ్రేణుల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో ఉమ్మడి జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంగళవారం ఉదయం భువనగిరి కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై బీజేవైఎం కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి దిగారు. కార్యాలయంలోని అద్దాలు, పూలకుండీలను ధ్వంసం చేయడంతో పాటు ఫ్లెక్సీలు, నేమ్ బోర్డుపై నల్లరంగు చల్లారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నినాదాలు చేశారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి వార్త తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతీకార చర్యలకు దిగారు. భువనగిరిలోని బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడి, ఆఫీసులోని ఫర్నీచర్ను ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడికి దిగడంతో పరిస్థితి మరింత చేయిదాటింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనా స్థలాల్లో అదనపు బలగాలను మోహరించి ఆందోళనకారులను చెదరగొట్టారు. రెండు వైపులా దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు