ఆదివాసీ బిడ్డ శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి సీతక్క
ఆదివాసీ బిడ్డ శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి సీతక్క
Seethakka


భద్రాద్రి కొత్తగూడెం, 01 సెప్టెంబర్ (హి.స.)

తుక్కుగూడలో దారుణ హత్యాచారానికి గురైన నర్సు ఉకే శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, నిందితుడికి ఫాస్ట్రక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెంలోని శిరీష కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు నునావత్ రాధాబాయితో కలిసి మంత్రి సీతక్క పరామర్శించారు. ఈ సందర్భంగా శిరీష కుటుంబ సభ్యులను ఓదార్చి, శిరీష చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం సీతక్క మాట్లాడుతూ.. శిరీష హత్యాచార ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఘటన తెలిసిన వెంటనే పోలీసు అధికారులతో, డీజీపీతో మాట్లాడి దర్యాప్తు పురోగతిని పర్యవేక్షించామని తెలిపారు. నిందితుడిని వెంటనే గుర్తించి అరెస్టు చేయడంలో పోలీసులు వేగంగా స్పందించారని అన్నారు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేమని, అయితే శిరీష కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే స్వయంగా శిరీష కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. అత్యంత నిరుపేద ఆదివాసీ కుటుంబానికి చెందిన శిరీష తన కాళ్లపై తాను నిలబడాలనే ఆశయంతో చదువుకుని నర్సుగా ఉద్యోగం చేస్తోందన్నారు. కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఆశతో హైదరాబాద్కు వచ్చి ఉద్యోగం చేస్తున్న యువతి ఇలాంటి దారుణ ఘటనకు బలికావడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చెక్కును అందజేశామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande