
హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.)
ఇందిరమ్మ ఇండ్ల లక్కీ డ్రాలో అవకతవకలు జరిగాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన ఆరోపణలు చేశారు. హౌసింగ్ బోర్డు ఎండీ గౌతమ్ తీరు వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి కేటాయించాల్సిన 480 ఇండ్లకు గాను 120 ఇండ్లే ఇచ్చారని అవి కూడా నియోజకవర్గానికి సంబంధంలేని వారికి కట్టబెట్టారని ఆరోపించారు. తన నియోజకవర్గానికి కేటాయించిన ఇండ్లలో 360 ఇళ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారుల వైఖరిపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు అసెంబ్లీలో ప్రశ్నిస్తానని హెచ్చరించారు.
రెండు రోజుల క్రితం బంజారాహిల్స్ కొమురం భీమ్ ఆదివాసీ భవన్లో తన నియోజకవర్గానికి సంబంధించిన ఇందిరమ్మ టవర్స్ లక్కీ డ్రా కార్యక్రమాన్ని తాను రాకముందే ప్రారంభించడంపై దానం సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ పాటించలేదంటూ కార్యక్రమం మధ్యలో నుంచే ఆయన వెళ్లిపోయారు. ఈ ఘటన హైదరాబాద్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ క్రమంలో ఇవాళ మీడియా కార్యక్రమంలో మాట్లాడిన దానం తనకు ప్రోటోకాల్ విషయంలో అధికారులు ఇప్పటి వరకు క్లారిఫికేషన్ ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రోటోకాల్ విషయంలో తనకు జరిగినట్లుగా ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేలకు జరిగితే పరిస్థితి ఇలాగే ఉండేదా అని ప్రశ్నించారు. అక్కడ ఇలాగే చేస్తే బట్టలిప్పి కొట్టేవారని న్యూ సిటీ ఎమ్మెల్యేలు వీక్ అని అధికారులు అనుకోవద్దని హెచ్చరించారు. గతంలో ఓ అధికారిని కొట్టి జైలుకు కూడా వెళ్లి వచ్చానని మేము కూడా అన్నిరకాల రాజకీయం చూసి వచ్చామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..