
నల్గొండ, 01 సెప్టెంబర్ (హి.స.)
భవిష్యత్తులో తెలంగాణలో బీఆర్ఎస్ కనుమరుగవడం ఖాయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం జోష్యం చెప్పారు. ఈ నెల 5వ తేదీన నకిరేకల్ పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. సీఎం సభా స్థల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్లతో కలిసి మంగళవారం పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వ సొమ్మును వృథా చేస్తున్న ప్రతిపక్ష నేత కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రి 420 హామీలు ఇచ్చి తెలంగాణను దోచుకున్నారన్నారు. గత ప్రభుత్వ విధ్వంసపు పునాదులపై వికాసపు సభ నిర్వహిస్తున్నామని ఆనందం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. కనీసం అసెంబ్లీకి వచ్చే సోయి కూడా ప్రతిపక్ష నాయకుడికి లేదన్నారు. దళిత ముఖ్యమంత్రి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రుణమాఫీ ఇలా బోలెడన్ని మోసపూరిత వాగ్దానాలు చేసింది వారు కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని తన బిడ్డ కవితనే చెబుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి సమస్యను తన సమస్యగా భావించి పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు