
నెల్లూరు, 01 సెప్టెంబర్ (హి.స.)నెల్లూరు నగరంలోని దారుణ హత్యకు గురైన రౌడీషీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ హత్య కేసుని పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు స్నేహితుల మధ్య పాత గొడవలు, విభేదాలే కారణమని తేల్చారు. వీరంతా మద్యం సేవించే సమయంలో సాయితేజ తలపై బండరాయితో కొట్టి హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారు. ఈ హత్య కేసులో మొత్తం 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు వివరించారు.
ఈ సంఘటన స్థలంలో లభించిన ఆధారాలు, సైబర్ టెక్నాలజీ, సీసీటీవీ ఫూటేజీతోపాటు అనుమానితుల కదలికలపై నిఘాతో నిందితులను వెంటనే పట్టుకున్నామని పోలీసులు వెల్లడించారు. కేవలం 24 గంటల్లో ఈ కేసు ఛేదించిన డీఎస్పీలు గిరిధర్, జి. శ్రీనివాసరావు, సీఐ సీతారామయ్యతోపాటు సిబ్బందిని నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల అభినందించారు. శాంతిభద్రతలకి విఘాతం కలిగించినా, నేరాలకి పాల్పడినా ఎవరినీ ఉపేక్షించబోమని జిల్లా ప్రజలను ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.
నగరంలోని స్థానిక ఆర్టీవో కార్యాలయం సమీపంలో రౌడీ షీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ ఆదివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న డీఎస్పీలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పట్టారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV