వెయ్యి రోజుల్లో 1000 మోసాలు, అబద్ధాలు.. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై టీ బీజేపీ చార్జిషీట్
వెయ్యి రోజుల్లో 1000 మోసాలు, అబద్ధాలు.. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై టీ బీజేపీ చార్జిషీట్
BJP


హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.)

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో వెయ్యి అబద్ధాలు, వెయ్యి మోసాలతో సాగిందని తెలంగాణ బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఇవాళ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ వెయ్యి రోజుల్లో అంతా అస్తవ్యస్తంగా అయిందని అంతా కుంభకోణాలు, లా అండ్ ఆర్డర్ వైఫల్యమే ఉందన్నారు. ఎక్కడ చూసినా కుంభకోణాలు, అవినీతి పాలన తప్ప మరొకటి కనబడటం లేదన్నారు. తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అబద్ధాలతో ప్రజలను గోసపుట్టిస్తోందన్నారు. ఆరు గ్యారెంటీలకు చట్టబద్దత కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు.

మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల మహిళలకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకం అమలు చేసి ఉంటే ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రతి మహిళా ఖాతాలో రూ.83 వేలు పడేవి కదా అని నిలదీశారు. ఫించన్లు, ఇందిరమ్మ ఇండ్లు, నిరుద్యోగులు ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో విద్యార్థులు తమ తల్లిదండ్రుల బంగారం అమ్ముకుని సర్టిఫికెట్లు తెచ్చుకునే పరిస్థితి వచ్చిందన్నారు. బిహార్ వంటి రాష్ట్రం విద్యాశాఖకు తమ బడ్జెట్లో 10 శాతం కేటాయిస్తే తెలంగాణలో మాత్రం కేవలం 8 శాతమే కేటాయించారని విమర్శించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. విద్యా భరోసా కార్డులు ఏమయ్యాయని నిలదీశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande