
హైదరాబాద్, 01 సెప్టెంబర్ (హి.స.)
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు,
మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు అరెస్ట్లపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించేందుకు, నిరసన తెలిపేందుకు వెళ్తున్న నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. దాడులు చేసేవారిని కాపాడటమేనా కాంగ్రెస్ చెబుతున్న 'ఇందిరమ్మ రాజ్యం'? అని ప్రశ్నించారు. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిని ధ్వంసం చేసిన నిందితులపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని అడిగారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని సీరియస్ అయ్యారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపిన వారి ఇళ్లపై దాడులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందా? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారు?, పోలీసులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రమం వ్యక్తంచేశారు.
అక్రమంగా అరెస్ట్ చేసిన బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు రాంచందర్ రావుతో పాటు ఇతర నాయకులను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, జరిగే ప్రతీ సంఘటనకు ప్రభుత్వంతో పాటు పోలీసులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..