తిరుమలలో పెరిగిన రద్దీ.. దర్శన సమయాలపై భక్తుల ఆగ్రహం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్వదర్శనార్థం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 27 కంపార్టుమెంట్లు ఫుల్లయ్యాయి.
తిరుమల


తిరుమల, 01 సెప్టెంబర్ (హి.స.)తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి సర్వదర్శనార్థం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 27 కంపార్టుమెంట్లు ఫుల్లయ్యాయి. ఉదయం 8 గంటల తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు 8-12 గంటల సమయం పడుతుందని టీటీడీ సిబ్బంది తెలిపారు. అలాగే రూ.300 శీఘ్రదర్శనానికి 3-4 గంటలు, సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4-6 గంటల సమయం పడుతుందని పేర్కొన్నారు. కాగా.. నిన్న (సోమవారం) స్వామివారిని 77,042 మంది భక్తులు దర్శించుకోగా.. 36,698 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన వివిధ కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు సమకూరింది. ఇదిలా ఉండగా.. భక్తులకు నిన్న ఒక్కరోజే 4.14 లక్షల లడ్డూలను విక్రయించారు.

కాగా.. స్వామివారి దర్శనాల్లో పారదర్శకత లోపిస్తోందని భక్తులు ఆరోపిస్తున్నారు. టైమ్ స్లాట్ విధానాన్ని తీసుకొచ్చినా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని వాపోతున్నారు. దళారీ వ్యవస్థ పెరిగిపోతోందని, కిందిస్థాయి ఉద్యోగులు భక్తుల నుంచి రూ.500 నుంచి రూ.1000 వరకూ వసూలు చేసి భక్తులను నేరుగా లోపలికి పంపుతున్నారన్న ఆరోపణలున్నాయి. రేపటి టోకెన్ దర్శనం ఉన్నవారినీ ఈరోజే పంపుతుండటంతో దర్శనం కోసం వేచి ఉండే సమయం పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande