
ఢిల్లీ , 12 సెప్టెంబర్ (హి.స.)సెప్టెంబర్ 12, 13 తేదీల్లో బ్రిక్స్ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు దాదాపు 15 వేల మంది సిబ్బందిని రంగంలోకి దించారు. కేంద్ర హోంశాఖ నుంచి సుమారు 200 సీఏపీఎఫ్ కంపెనీలను భద్రతా విధుల కోసం కేటాయించారు. డాగ్ స్క్వాడ్స్తో తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఢిల్లీ పోలీసులు, కేంద్ర బలగాలు కలిసి భారీ భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాయి.
భారత్ మండపం వద్ద భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అనుమానాస్పద వస్తువులు, వ్యక్తుల కదలికలను గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్స్ను కూడా ఉపయోగిస్తున్నారు. సదస్సుకు వచ్చే ప్రతినిధులు, ప్రముఖుల భద్రతకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పలు దశల్లో తనిఖీలు చేస్తున్నారు.
ఇక, ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సెప్టెంబర్ 12,13 తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కీలక మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణలు ఉంటాయని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అంబులెన్స్లు, ఇతర అత్యవసర వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్