
హైదరాబాద్, 13 సెప్టెంబర్ (హి.స.)
హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్
రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) అందిస్తున్న సేవల తెలుసుకునే వెసులుబాటు హైడ్రా కల్పించింది. hydra.telangana.govt.in
పేరిట రూపొందించిన పోర్టల్ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు.
హైడ్రాకు సంబంధించిన వివిధ సేవలు, సమాచారం, అత్యవసర సహాయం, వాతావరణ వివరాలు, భూములు, చెరువులు, అధికార పరిధి తదితర అంశాలను తెలుసుకోవచ్చు. చెరువుల హద్దులు, కాలువల లెక్కలు, ప్రభుత్వ భూముల వివరాలు, విపత్తు నిర్వహణ సమాచారంతో పాటు హైడ్రా కార్యకలాపాలన్నీ ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. హైడ్రా 24 గంటల అత్యవసర హెల్ప్ లైన్ 1070 వివరాలను పోర్టల్లో ప్రముఖంగా పొందుపరిచారు.
చెట్లు కూలిపోవడం, అగ్ని ప్రమాదాలు, రహదారులపై నీరు నిలవడం, వరదలు, సహాయక చర్యలు, ఇతర విపత్తు సంబంధిత అత్యవసర పరిస్థితులపై పౌరులు ఈ నంబరుకు సమాచారం ఇవ్వవచ్చు. హైడ్రా పోర్టల్ ద్వారానే ఫైర్ సేఫ్టీ ఎన్వోసీలకు దరఖాస్తు చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో, భారీ వర్షాల సమయంలో ప్రజలు తాజా వాతావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి. చెరువుల ఎఫ్ఎఎల్, బఫర్ జోన్ల వివరాలు హైడ్రా వెబ్సైట్ నుంచి చెరువులకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) వివరాలు, ఇతర జలాశయాల చుట్టూ అమల్లో ఉండే ఎన్టీఎల్, బఫర్ జోన్ నిబంధనలపై కూడా పోర్టల్లో సమాచారం అందుబాటులో ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన భూ భారతి పోర్టల్కు హైడ్రా వెబ్సైట్లో నేరుగా లింక్ అందుబాటులో ఉంది. భూమి కొనుగోలు, ఇతర లావాదేవీలు చేపట్టే ముందు సర్వే నంబర్ పట్టాదారు వివరాల ఆధారంగా అందుబాటులో ఉన్న భూ రికార్డులను పరిశీలించుకునే అవకాశం హైడ్రా కల్పించింది. చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణకు హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం, తాజా వివరాలు కూడా పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు