
కరీంనగర్, 13 సెప్టెంబర్ (హి.స.)
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో వినాయక నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు పకడ్బందీ బందోబస్తు చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు.
శనివారం కమిషనరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నుంచి ముఖ్య కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలు, నిమజ్జన మార్గాల్లో సీసీ కెమెరాల నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
ప్రతి గణేష్ మండపం వద్ద నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 24 గంటలూ వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్, అగ్నిమాపక, విద్యుత్ శాఖల అత్యవసర ఫోన్ నంబర్లతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. మానకొండూరు, కొత్తపల్లి, చింతకుంట ప్రధాన నిమజ్జన ఘాట్ల వద్ద భారీ క్రేన్లు, లైటింగ్, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు రూట్ మ్యాప్ అమలు చేస్తున్నామని, రోడ్లకు అడ్డంగా ఉన్న విద్యుత్ వైర్లు, చెట్ల కొమ్మలను తొలగించినట్లు సీపీ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు, వదంతులు వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు