
హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)
ఒక సాధారణ సబ్-రిజిస్ట్రార్ను సస్పెండ్ చేసి, అదేదో ఘనకార్యంలా ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని బిజెపి లెజిస్లేచర్ పార్టీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. భూ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై వారు ధ్వజమెత్తారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వివాదాస్పద రిజిస్ట్రేషన్ల విషయంలో సబ్-రిజిస్ట్రార్ ఇచ్చింది కేవలం సాధారణ రిజిస్ట్రేషన్ మాత్రమేనని అయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునే స్పష్టమైన అవకాశం ఉందని తెలిపారు. చిన్న ఉద్యోగులపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్న ప్రభుత్వం.. ఈ మొత్తం వ్యవహారంలో అసలైన బాధ్యులైన ఐఏఎస్ అధికారులు, రెవెన్యూ విభాగంలోని ఉన్నతాధికారులను ఎందుకు కాపాడుతోందని ఈ సందర్భంగా ఏలేటి ప్రశ్నించారు. భారీ ఎత్తున జరిగిన ఈ అక్రమాల్లో తెరవెనుక ఉన్న ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటని నిలదీశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..