
మహబూబాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)
ప్రభుత్వ విప్, డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ కార్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి శివారులో ఆయన ప్రయాణిస్తున్న వాహనంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ తన సిబ్బందితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, ఆయన వాహనంలో ఉన్న పవర్ బ్యాంక్ ఒక్కసారిగా దట్టమైన పొగలతో పేలిపోయింది.
దీంతో కారు క్యాబిన్ లో, మంటలు వ్యాపించాయి. ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన భద్రతా సిబ్బంది అప్రమత్తతతో వ్యవహరించి, ఎమ్మెల్యేను సురక్షితంగా కారు బయటకు తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ అక్కడి నుంచి మరో వాహనంలో మహబూబాబాద్కు బయలుదేరి వెళ్లారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు