
కొత్తూరు:, 19 సెప్టెంబర్ (హి.స.)
పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని కొత్తూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ భార్గవ్ ప్రసాద్ వెల్లడించారు. శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్వహించిన 'పచ్చదనం - పరిశుభ్రత' కార్యక్రమంలో వైద్యాధికారులతో పాటు సిబ్బంది కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని మరియు ఇతర వ్యర్థాలను సిబ్బందితో కలిసి పూర్తిగా తొలగించారు. అలాగే ప్రాంగణమంతటా అడ్డదిడ్డంగా పెరిగిన పిచ్చి మొక్కలను ఏరివేసి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. పారిశుధ్య పనుల అనంతరం ఆసుపత్రి ఆవరణలో పచ్చదనం పరిఢవిల్లేలా పలు రకాల మొక్కలను నాటారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు వైద్యాధికారి తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ