
విశాఖపట్నం 19 సెప్టెంబర్ (హి.స.)
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని, వంద శాతం విజయావకాశాలతో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ఆయన శనివారం నిర్వహించిన పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
గెలుపే ప్రామాణికం - బలమైన అభ్యర్థుల ఎంపిక:
ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల సంఖ్య కంటే, విజయం సాధించే సామర్థ్యం ఉన్న స్థానాలపైనే ప్రధానంగా దృష్టి సారించాలని కేడర్‌కు సూచించారు. వార్డుల వారీగా ప్రజాదరణ పొందిన నేతలను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఏవైనా పొరపాట్లు లేదా ఆటంకాలు ఎదురైతే వెంటనే పార్టీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
పూర్తిస్థాయిలో ప్రజల్లోకి పవన్ కల్యాణ్:
జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇకపై నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని మనోహర్ వెల్లడించారు. రాజకీయాల్లో అనుభవమే కీలకమని పేర్కొంటూ.. గత జీవీఎంసీ (GVMC) ఎన్నికల్లో గెలిచిన, ద్వితీయ స్థానంలో నిలిచిన డివిజన్లలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
ప్రజా సమస్యలపై పోరాటమే ముఖ్యం:
కేవలం ఎన్నికల్లో టికెట్ సాధించడమే లక్ష్యం కాకూడదని, క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి, స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించే వారికే ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ఉత్తరాంధ్రకు భారీ ప్రాజెక్టులు - కూటమి ఐక్యతతోనే భరోసా:
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐక్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు పెట్టుబడిదారుల్లో కొండంత నమ్మకాన్ని నింపాయని అన్నారు. దీనికి ఫలితంగానే ఉత్తరాంధ్ర ప్రాంతానికి భారీ ప్రాజెక్టులు, పెట్టుబడులు తరలివస్తున్నాయని పేర్కొన్నారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు, ప్రయోజనాల కోసం కట్టుబడి పనిచేస్తుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi