
హైదరాబాద్, 20 సెప్టెంబర్ (హి.స.)
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయంకరమైన రహదారి ప్రమాదం జరిగింది. మెరైన్ డ్రైవ్ వైపు నుంచి అతివేగంతో వస్తున్న ఒక బీఎండబ్ల్యూ (BMW) లగ్జరీ కారు, కోస్టల్ రోడ్డు బ్రిడ్జిపై వెళ్తుండగా ఒక్కసారిగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దాంతో ఆ వాహనం పక్కనే ఉన్న రక్షణ గోడను బలంగా ఢీకొట్టి, దాదాపు 75 అడుగుల ఎత్తు ఉన్న బ్రిడ్జి పైనుంచి కిందపడిపోయింది.
ఈ ప్రమాద తీవ్రతకు కారు రూపురేఖలు మారిపోగా, అందులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడటంతో అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. సమాచారం ప్రకారం మృతి చెందినవారు స్థానిక కళాశాలలో చదువుతున్న విద్యార్థులుగా తెలిసింది. శనివారం రాత్రి పార్టీ ముగించుకుని తిరిగి వస్తుండగా అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi