
ఢిల్లీ, 20 సెప్టెంబర్ (హి.స.)
యువతను డ్రగ్స్ మరియు మత్తు పదార్థాలకు దూరంగా ఉంచడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన '100 వారాల నషా ముక్త్ యువ అభియాన్' ప్రచారంలో భాగంగా నేడు భారతదేశమంతటా 1,067 కేంద్రాల్లో 'రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్' ను ఘనంగా నిర్వహిస్తున్నారు. మై భారత్ (MY Bharat) మరియు నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) భాగస్వామ్యంతో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ ఈ విస్తృత చైతన్య కార్యక్రమాన్ని చేపట్టింది.
యువతలో అవగాహన పెంచేందుకు 471 జిల్లా కేంద్రాలు, పలు అనుబంధ సంస్థలకు చెందిన మరో 596 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున 'మాదకద్రవ్య రహిత ప్రతిజ్ఞ' చేయించడంతో పాటు సంతకాల సేకరణను ప్రారంభించారు. విద్యాసంస్థలు, పాఠశాలలు మరియు ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు ఇందులో చురుగ్గా పాల్గొంటున్నారు. వీధి నాటకాలు, నినాదాల పోటీలు మరియు యువజన సదస్సుల ద్వారా డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ సమాజంలో సానుకూల మార్పు తెచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
వికసిత భారత్ లక్ష్యానికి అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ 100 వారాల ప్రణాళికలో క్రీడలు, ఆరోగ్యం, యోగా మరియు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నారు. మత్తు మహమ్మారి నుంచి దేశ యువ శక్తిని కాపాడుతూ, వారిని సన్మార్గంలో నడిపించడమే ఈ సంకల్ప సమారోహ్ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi